Katakshapur bridge problems in Warangal: అదొక జాతీయ రహదారి... అటుగా రోజూ వందల వాహనాలు తిరుగుతుంటాయి. పర్యాటక ప్రాంతం, పుణ్యక్షేత్రాలుండడంతో... అధికమంది ప్రయాణిస్తుంటారు. కానీ కాస్త వర్షం పడితే చాలు... ఆ దారిలో ఉండే వంతెనపైకి నీళ్లొస్తాయి. దీంతో రోడ్డు దాటాలంటే... వాహనదారులకు తలప్రాణం తోకకోస్తుంది హనుమకొండకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెన కటాక్షపూర్‌లో ఉంది. ఇక్కడ కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా... పనుల్లో జాప్యంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి వంతెన కావాలంటూ వేడుకుంటున్నారు.
కటాక్షపూర్ మత్తడితో వాహనదారులకు నరకం: హనుమకొండ నుంచి మేడారం వెళ్లే మార్గంలో... జాతీయ రహదారి 163పై ఉన్న కటాక్షపూర్ వంతెనతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా కొత్త వంతెన కట్టేందుకు ముహుర్తం కుదురట్లేదు. ఫలితంగా వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. హనుమకొండ నుంచి నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. ములుగు, భూపాలపల్లితోపాటు... రామప్ప, లక్నవరం, మేడారం వెళ్లే వారు... ఈ మార్గం గుండా ప్రయాణించాలి. కాస్త వర్షం కురిస్తే చాలు కటాక్షాపూర్ వద్ద చెరువు మత్తడి పోస్తుంది. కటాక్షపూర్ వద్ద లోలెవల్ వంతెన ఉండడంతో... మత్తడి నీళ్లన్నీ వంతెనపైకి వస్తాయి. దీంతో రెండు వైపుల వాహనదారులు వంతెన దాటాలంటే నరకమే.
ప్రమాదాలకు నెలవు: ప్రధాన రహదారి కావటంతో.... ఈ మార్గం గుండానే అత్యధికమంది ప్రయాణిస్తారు. వర్షం కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ... నిత్యం వాహదారులు అనేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక భారీ వర్షం కురిస్తే... రెండు మూడ్రోజుల వరకూ వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రాత్రి సమయంలో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో... ప్రమాదాల బారినపడుతున్నారు. ఇటీవల రెండు మూడ్రోజులు వర్షం పడడంతో... మరోసారి వాహనదారులకు కష్టాలు తప్పలేదు.
నిధులున్నా కానరాని పనులు..: ముప్పై ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా... ఇటీవల వర్షాలు ఎక్కువగా కురవడంతో ఇబ్బందులు పెరిగాయి. 317 కోట్లతో వంతెన.... నాలుగు వరసల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నిధులూ మంజూరై... టెండరు కూడా ముగిసింది. కానీ ఇదిగో అదిగో అంటున్నారు తప్ప... పనులు మాత్రం ప్రారంభం కావట్లేదు. దీంతో స్థానికంగా ఉండే రైతులు కూడా పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుత్తేదారు నిర్లక్ష్యం... అధికారుల పర్యవేక్షణా లోపం... వాహనదారులకు శాపంగా మారుతోంది. మూల మలుపులను సరిచేసి కొత్త వంతెన నిర్మించాల్సి ఉంది. కానీ ముందు ఏ పనులు చేపట్టాలో తేల్చుకోకపోవడంతో నిర్మాణంలో జాప్యం ఏర్పడుతోంది. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు, ఉద్యోగులు, స్థానికులు వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: