తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల(Palamuru-Rangareddy Lift Irrigation Project) పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయన్న సంయుక్త కమిటీ నివేదిక, పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ(National Green Tribunal)) తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న తెలంగాణ వాదనతో మేం సంతృప్తి చెందితే.. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లబోమని, లేదంటే నివేదికకు సంబంధించిన అంశాలపైనా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అభ్యంతరాలను ఈ నెల 4లోగా దాఖలు చేయాలని, 5న విచారణ చేపడతామని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల(Palamuru-Rangareddy Lift Irrigation Project) పనులు చేపడుతోందంటూ ఏపీకి చెందిన రైతులు చంద్రమౌళీశ్వర రెడ్డితోపాటు, ఉదండాపూర్ రిజర్వాయర్ నిమిత్తం అనుమతుల్లేకుండా మైనింగ్ చేపడుతున్నారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన కోస్గి వెంకటయ్యలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నందున అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ చంద్రమౌళీశ్వరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది పి.ఎస్.రామన్ వాదనలు వినిపిస్తూ తాగునీటి అవసరాల ముసుగులో సాగునీటి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Lift Irrigation Project) నిర్మిస్తున్నారని తేలిందన్నారు. ఈ దశలో తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ అభ్యంతరాలను దాఖలు చేస్తామన్నారు. తాగునీటి అవసరాలకే పనులు చేపడుతున్నామంటూ తాము చెప్పినదానికే కట్టుబడి ఉన్నామన్నారు. నివేదిక తప్పుదారి పట్టించేలా ఉందని ఆరోపించారు.
ప్రాథమిక అంశాలు తేలాలని, ముందుగా దీనిపై నోటీసులు ఇవ్వాల్సి ఉందనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్ విచారణ చేపట్టినప్పటి నుంచి మీరు ఉంటున్నారని, కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసీ, ఇప్పుడు ప్రాథమిక అభ్యంతరాలంటే ఎలా అని ప్రశ్నించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం(Rayalaseema lift irrigation project) విషయంలో ఒకలా...ఇక్కడ మరోలా అంటున్నారంది. ఆరేళ్లుగా పనులు కొనసాగుతున్నందున పిటిషన్ విచారణార్హం కాదని ఏఏజీ వాదించారు. విచారణార్హతపై వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ తరఫున ఏజీ శ్రీరాంతోపాటు న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డి తెలిపారు.
తెలంగాణ పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ నివేదికలో పేర్కొన్న కాలుష్య తీవ్రతను పరిశీలించాలని కోరగా ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌లోని అంశాలు వేరని ఆయన చెప్పగా... ఎన్జీటీ(National Green Tribunal) దీనిపై విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.