వర్షాభావంతో రాయలసీమలో ఎండిపోతున్న వేరుశనగ పంటకు నీరందించి రైతులను ఆదుకోవాలని… ఏపీ ముఖ్యమంత్రి జగన్కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. పంటనష్టం ఎన్యూమరేషన్ జరిపి బకాయి ఉన్న పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. మొదటి స్థానానికి చేరే ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన చెందారు.
అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంటకు అనావృష్టి సెగ తగిలిందన్న లోకేశ్... నీరులేక పంట ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు చేసిన తర్వాత వరుస వర్షాలతో దిగుబడిపై ఆశలు ఊరించాయని, ఇప్పుడు ఎండ తీవ్రత రైతులను ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి పంట రక్షించుకునేందుకు తడులు అందించే ఏర్పాటు చేయాల్సిన అత్యవసరం ఉందన్నారు. వేరుశనగకు రక్షక తడులు అందకపోతే… మొత్తం 12 లక్షల ఎకరాలకు పైగా పంట పోయినట్టేనని లోకేశ్ అభిప్రాయపడ్డారు. కేవలం రైతులు పెట్టిన పెట్టుబడే 2 వేల కోట్లకుపైగా నష్టపోనున్నారని వివరించారు. పంటకు తడి అందించి నిలబెట్టినా కనీసం కూలీల ఖర్చులైనా వచ్చే అవకాశం లేని ఈ పరిస్థితుల్లో… రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేరుశనగ నష్టంపై ఎన్యూమరేషన్ నిర్వహించాలని కోరారు. రైతుల్ని ఆదుకోకపోతే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్.. ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయే ప్రమాదం ఉందని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు ప్రభుత్వం బకాయి ఉన్న నష్టపరిహారం 967 కోట్లు తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.