యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పోరులో నాబార్డ్ సైతం తన వంతు కృషి చేస్తుంది. కొవిడ్ రెండో దశ వేరియంట్స్ నేపథ్యంలో... ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజు స్వయంగా వినూత్నరీతిలో ఓ వీడియో సందేశం రూపొందించారు. నాబార్డ్... నాబ్‌ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వీడియో సందేశం మహారాష్ట్రలోని ముంబయిలో విడుదల చేశారు. ఇది దేశవ్యాప్తంగా విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలన్నది లక్ష్యం.
మోదీ సర్కారు... దేశవ్యాప్తంగా మొదలు పెట్టిన కొవిడ్ టీకా ప్రచారం ప్రపంచంలోనే అతిపెద్దదని డాక్టర్ చింతల అన్నారు. ఈ టీకా కార్యక్రమం సఫలీకృతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అత్యంత ఉత్తమమన్నారు. టీకా తీసుకోవడం వల్ల భద్రత, భరోసాగా ఉంటుందని తెలిపారు. అందరం కలిసి కొవిడ్‌పై యుద్ధం చేసి విజయం సాధిద్ధామని ఛైర్మన్ కోరారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రముఖ ఫిజిషియన్ కన్సల్టెంట్ డాక్టర్ హేమంత్ మన్‌కంద్ తన అనుభవాలను తెలుగు అనువాదంలో వివరింపజేశారు. "మైదానంలో క్రికెట్ ఆడుతున్నట్లు ఊహించుకోండి... భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు... ఎదురుగా తీవ్రమైన వేగంతో బౌలర్ బాల్ విసురుతున్నాడు. అప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు...? తలకు హెల్మెంట్ లేకుండా ఆడాలా...? లేక హెల్మెట్ ధరించి ఆడాలా... శిరస్త్రాణం ధరిస్తే రక్షణ ఉంటుంది. పొరపాటున బౌలర్ విసిరిన బంతి తగిలినా.. తీవ్రమైన గాయం కాదు. క్రికెట్లో హెల్మెట్ ఎలా ఉందో... అలాగే కరోనాకు టీకా" అంటూ డాక్టర్ సందేశం సాగింది.