మూర్ఛ రోగం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 100 మందికి పైగా రోగులు వింత రోగ లక్షణాలతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఫలితంగా ఇప్పటి వరకు వీరి సంఖ్య 464కు చేరింది. మూర్ఛ, తలనొప్పి, వికారం, వాంతులు, నీరసం లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారితో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పడకలన్నీ నిండిపోతున్నాయి.
అంతు చిక్కటం లేదు..
రక్త నమూనాలు, వైరల్, బాక్టీరియల్, ఫంగల్ టెస్టులతో పాటు ఆహారం, నీరు, వాయు కాలుష్య పరిస్థితులపైనా పరీక్షలు నిర్వహించినప్పటికీ.. ఈ వింతరోగం తాలూకు వివరాలు తెలియకపోవటం వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే రోగుల కణజాలాలకు సంబంధించిన కల్చర్ టెస్టు ద్వారా వింత రోగం తాలూకు గుట్టు బయటకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ సహా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, పుణెలోని వైరాలజీ ల్యాబ్, సీసీఎంబీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లాంటి సంస్థలకు వివిధ నమూనాలను పంపి పరీక్ష చేసినట్టు అధికారులు వెల్లడించారు.
మరోవైపు అంతకంతకూ రోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఏలూరు నగరంలోని 62 వార్డు సచివాలయాలు, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రాలను వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఆందోళనకర పరిస్థితిలో ప్రభుత్వాసుపత్రికి వచ్చేలోపు ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో వైద్యం చేయించుకోవాలని సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి: కేసీఆర్