Heavy Rains in Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు మత్తడి పోస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు నగరంలోని పలు కాలనీలు నీటి గుప్పిట్లో చిక్కుకుపోయాయి. పలు ప్రాంతాల్లోని కాలనీలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. భాగ్యనగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు కాగా.. నాలుగు గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.
ఉస్మాన్‌సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,786.65 అడుగులు వరకు నీరు చేరింది. హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,760.50 అడుగులు మేర వరద నీరు చేరింది.
భయం గుప్పిట్లో నగర ప్రజలు..
నగరంలో కురిసిన భారీ వర్షాలకు జీడిమెట్ల పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువుకు భారీగా వరద వస్తోంది. దీంతో చెరువుకు ఎగువన ఉన్న ఉమామహేశ్వరకాలనీ వాసులు మరోసారి భయం గుప్పిట్లో గడుపుతున్నారు. కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి ఫాక్స్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద వస్తోంది. అలాగే దుండిగల్ మండల పరిధిలోని బహదూర్ పల్లి గ్రామంలోని బోభాఖాన్ చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు పారుతుంది. దీంతో మున్సిపల్ అధికారులు పరిసర వాసులను అప్రమత్తం చేశారు.
షియర్ జోన్ వల్ల నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాజాగా మరోసారి గరిష్ఠ నీటి మట్టాన్ని తాకింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.43 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.70 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం దాటడంతో అధికారులు తూముల ద్వారా వరద నీరు దిగువకు పంపిస్తున్నారు. కూకట్ పల్లి నాలా నుంచి భారీగా వస్తున్న వరద నీటి కారణంగా హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. వర్షం కొనసాగితే మరింత వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇవీ చదవండి: