Munugode Congress Candidate: మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు... పదునైన వ్యూహాలతో ముందుకెళ్లాలని అధిష్ఠానం నిర్ణయించింది. గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో.. మునుగోడు అభ్యర్థి ఎంపికపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్ దామోదర్‌రెడ్డి, నల్గొండ, భువనగిరి రెండు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. రాత్రి దాదాపు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం కొనసాగింది. జానారెడ్డి, జీవన్‌రెడ్డి జూమ్‌లో హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో భాజపా, తెరాస మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. భాజపా తెలంగాణలో పాగా వేసేందుకు తెరాస మద్దతుతో ప్రయత్నిస్తున్నట్లు నేతలు ఆరోపిస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభావం ఎంతవరకు ఉంది. ఆయనతో పాటు ఎంతమంది కాంగ్రెస్ నాయకులు భాజపాలోకి వెళ్లారు. ఆ ప్రభావం ఎలా ఉంటుందనే కోణంలో నేతలు చర్చించుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే టికెటు కోసం ఎవరెవరు పోటీపడుతున్నారు..? వారి బలాబలాలపై చర్చించారు. మునుగోడు అభ్యర్థి ఎంపిక హుజురాబాద్ మాదిరి చివరి క్షణంలో కాకూడదని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా అభ్యర్థి ఎంపిక పూర్తి కావాలని నేతలు చర్చించుకున్నారు. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
మునుగోడు నియోజకవర్గంలో నలుగురు ఆశావహులతో ఇవాళ సమావేశం కావాలని పీసీసీ అధ్యక్షుడి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేతను ఇవాళ్టి సమావేశానికి ఆహ్వానించారు. ఉదయం గాంధీభవన్‌లో సమావేశమవుతారు. ఇందులో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త సునీల్ కనుగొల హాజరై మునుగోడు సర్వే వివరాలను వెల్లడించే అవకాశముంది. ఈ భేటీ తర్వాత తిరిగి ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన సీనియర్ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.