Municipality officials sealed houses: ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పన్నులు కట్టలేదంటూ రెండు ఇళ్లకు మున్సిపాలిటీ అధికారులు తాళం వేసి సీల్ వేశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. మోహన్ నగర్లోని గొర్ల సత్తిబాబు, గొర్ల రమణ ఇళ్లకు శనివారం సాయంత్రం తాళం వేసి సీల్ వేశారు. దీంతో స్థానికులు ఆందోళన చేపట్టారు.
సీల్ వేసిన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పరిశీలించారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వకుండా.. వారిపై పన్నుల భారం వేయటమేంటని నిలదీశారు. వైకాపా నాయకులు లక్షల్లో బకాయిలు ఉన్నా.. వారి జోలికి వెళ్లకుండా కేవలం తెదేపా సానుభూతి పరుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయాల్లో పన్నులు కట్టాలంటూ వాలంటీర్లు తలుపులు కొడుతున్నారని మండిపడ్డారు. ఇది సరైంది కాదని.. తీరు మారకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కల్తీ సారా తాగి తమ వాళ్లు మరణిస్తే.. సహజ మరణాలని ప్రభుత్వం చెబుతోంది