తెలంగాణలో సంక్రాంతి తర్వాతే పురపాలక ఎన్నికల సందడి మొదలు కానుంది. వార్డుల పునర్విభజన మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. పునర్విభజన అనంతరం పుర ఎన్నికల నిర్వహణలో కీలకమైన ప్రక్రియ.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించడం. ఎన్నికల కమిషన్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) తీసుకోనుంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించాల్సి ఉంటుంది. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి వార్డుల తుది జాబితాలను ప్రచురిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం పది, పదిహేను రోజుల సమయం అవసరమని అధికారులు అంటున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను ప్రకటించాల్సి ఉంటుంది.
ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
ఎలాంటి అవరోధాలూ లేకుంటే ఈ నెలాఖరుకల్లా సంబంధిత ఏర్పాట్లను ఓ కొలిక్కి తేవాలనుకుంటున్న ఈసీ.. జనవరిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో జనవరి 9, 10 తేదీల్లో రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల సదస్సును ఎస్‌ఈసీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సదస్సు అనంతరమే పురపాలక ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత ఎన్నికల ప్రకటన ఇచ్చి ఫిబ్రవరి తొలి వారంలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తుందని సమాచారం.
ఓటర్ల జాబితాల తయారీపై శిక్షణ
‘వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఎలా రూపొందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...’ అనే అంశంపై పురపాలక సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు రోజుల ప్రత్యేక శిక్షణను మంగళవారం ప్రారంభించింది. ఈ క్రమంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమై, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయితే ఎన్నికల సంఘం ఏర్పాట్లు దాదాపు కొలిక్కి వచ్చినట్లే.
ఇవీ చూడండి: పురపోరుకు రంగం సిద్ధం.. సంక్రాంతి తర్వాత పోలింగ్..!