మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయాంజల్ సీతారామస్వామి భూముల వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 1925 నుంచి ఇప్పటి వరకు ఆ భూములు ఎవరెవరి చేతులు మారాయి...? ఎవరెవరికి ఎంత భూమి ఉంది..? ఆ భూములపై బ్యాంకుల్లో ఎంత రుణాలు తెచ్చుకున్నారు..? అక్కడ జరిగిన నిర్మాణాలు ఎవరివి తదితర అంశాలను నిగ్గు తేల్చాలన్నారు. అధికార పార్టీకి చెందిన పత్రిక యాజమాన్యం, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలు కూడా సీతారామస్వామి భూములను కొనుగోలు చేశారంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఈటల రాజేందర్‌తో పాటు వీరికి కూడా అక్కడ భూములు ఉన్నందున... విచారణ పూర్తయ్యే వరకు ఆ ఇద్దరు మంత్రులను కూడా కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రతినిధిగా రఘునందన్‌రావును నియమించినప్పుడే ముఖ్యమంత్రి చిత్తశుద్ది ఏమిటో బయట పడిందని విమర్శించారు. 2009 జనవరిలో కేటీఆర్, 2015 మేలో అధికార పార్టీ పత్రిక యాజమాన్యం... ఆలయ భూములు కొనుగోలు చేసినట్లు తెలిపారు. సర్వే నెంబరు 658లోని ఏడు ఎకరాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విలాసవంతమైన ఫాంహౌజ్ కట్టుకున్నారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని నేరుగా కలిసి తన వద్ద ఉన్న వివరాలన్నీ అందచేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.