అమర్‌రాజా కంపెనీ తరలటంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్సలది చెరో మాట అని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. వైఎస్‌ఆర్ హయాంలోనే అమర్‌రాజాకు అదనపు భూ కేటాయింపులు చేశారని రఘురామ గుర్తు చేశారు. వైఎస్ హయాంలో లేని తప్పులు ఇప్పుడు ఎలా కనబడ్డాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ అడ్డగోలు అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు.
వివాదం ఏంటంటే..
తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్‌ఫ్రాటెక్ (ప్రైవేట్) సంస్థకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ ప్రభుత్వ హయాంలో (2009) చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్రి మండలాల్లోని నూనెగుండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామాల పరిధిలో అమరరాజా కంపెనీకి మొత్తం 483.27 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది.
'ఆ సంస్థ (అమరరాజా ఇన్‌ఫ్రాటెక్) భూములు తీసుకుని పదేళ్లవుతున్నా... ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకు రాలేదు. 253.6 ఎకరాలు ఖాళీగా ఉంచేసింది. ఆ భూముల్లో ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్)ని ఏర్పాటు చేస్తామని, డిజిటల్ వరల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పింది. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెడతామని, 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. 4,310 మందికి మాత్రమే ఉపాధి కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూమి విలువ రూ.60 కోట్లకు పైగా ఉంటుంది. ఆ సంస్థ అంత విలువైన ప్రజల ఆస్తిని ఖాళీగా వదిలేయడం ఒప్పందంలో చేసుకున్న నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజా ప్రయోజనాలకూ విరుద్ధం. నిబంధనల ప్రకారం కంపెనీ ఏ అవసరం కోసం తీసుకుంటే అందుకు రెండేళ్లలోగా ఆ భూముల్ని వినియోగించాలి. లేనిపక్షంలో ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకోవచ్చు' అని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జీవో నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..
అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు 483 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే భూమిని వినియోగించుకోవడం లేదంటూ.. 253 ఎకరాల్ని వెనక్కి తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ.. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ జూన్ 30 జీవో నెంబర్ 33 జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని అమర్ రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భూముల్ని వెనక్కు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఆ భూముల్లో రూ.2,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని.. భూములు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాల్లో వాస్తవం లేదన్నారు. అయితే ప్రభుత్వ చొరవతోనే ఏపీఐఐసీ ఆ సంస్థకు భూములు కేటాయించిందని.. వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వ తరఫు ఏజీ వాదించారు. జీవోనూ సస్పెండ్ చేయొద్దని కోరారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇదీ చూడండి: CM KCR TOUR: కాలినడకన వాసాలమర్రిలో వీధివీధిని పరిశీలించిన కేసీఆర్