అధికారం చేపట్టిన ఎనిమిదేళ్లలో తెరాస ప్రభుత్వం రైతులకు చేసిందేం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. డబ్బులు సంపాదించుకోవటం తప్పా.. చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన లేఖలో ఎక్కడ కూడా వడ్లు కొనమని చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఎవరు వచ్చినా.. చర్చకు సిద్ధమని అర్వింద్ సవాల్ విసిరారు.
ఎలాంటి ప్రయోజనం లేదు..
"మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 2 కోట్ల టన్నులైనా కొంటామన్నారు, ఇప్పుడు వరి వద్దంటున్నారు. ఏడేళ్లలో ఎంత ధాన్యం ఎగుమతి చేశారో కేసీఆర్ చెప్పాలి. వ్యవసాయరంగంలో ప్రపంచమంతా టెక్నాలజీ పెంచుకుని దూసుకుపోతోంది... మీరు కూడా టెక్నాలజీ పెంచుకుని అభివృద్ధి సాధించాలని లేఖలో కేంద్రం పేర్కొంది. కేవలం బాయిల్డ్ రైస్ కొనమని మాత్రమే కేంద్రం చెప్పింది. గరీబోళ్లు తినే బియ్యాన్ని ఫోర్టిఫై చేసేందుకు తెలంగాణ ప్రాంతంలోని రైస్‌మిల్లులను అడ్వాన్స్ చేసుకోవాలని చెబుతోంది. రైస్‌బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని సూచించింది. దీనిపై కేబినెట్ నుంచి ఎవరు వచ్చినా.. నేను చర్చకు సిద్ధం. ఎక్కడికైనా వచ్చి దీనిపై మాట్లాడతా.. ఎవరోస్తారో రమ్మనండి.
ఇందుకోసం కేంద్రమే 80 శాతం.. సబ్సిడీ ఇస్తుంది. కానీ.. ఎనిమిదేళ్ల నుంచి రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రీ ఏర్పాటు చేసింది లేదు. ఇండస్ట్రీ పెట్టాలని వస్తే.. అందులో 20 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఏడేళ్లలో కేసీఆర్ ఏ పంటకు బోనస్ ఇచ్చారో చెప్పాలి. వరి విత్తనాలు అమ్మొద్దని అధికారులు ఆదేశిస్తున్నారు. వరి విత్తనాలు అమ్మకపోతే గంజాయి విత్తనాలు అమ్మాలా?. కేవలం భాజపా జెండా మోసినందుకు గానూ.. సుమారు 100 మంది విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు చంచల్‌గూడ జైల్లో ఆరు నెలలుగా మగ్గిపోతున్నారు." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఇదీ చూడండి:
Huzurabad by Election: ఓట్లకు పైసలివ్వలేదని ధర్నాలు.. తలలు పట్టుకుంటున్న నేతలు