రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా సిద్ధాంతకర్త శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ 68వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్పొరేటర్లతో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నారు..?
కేంద్రం మీద యుద్ధం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించటం హస్యాస్పదంగా ఉందన్నారు బండి సంజయ్. వ్యవసాయ చట్టాల విషయంలో ఇలాగే యుద్ధం చేస్తానని చెప్పి... ఫాంహౌజ్ నుంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో కేంద్రంపై యుద్ధం చేస్తానంటున్నారు. కృష్ణ జలాల విషయంలో మొట్టమొదటి సమావేశంలోనే తెలంగాణ ప్రజలను మోసం చేశారని బండి ఆరోపించారు. 68 శాతం పరిహారక ప్రాంతానికి 555 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే ఒప్పుకోవటం వెనుక మతలబు ఏంటిని ప్రశ్నించారు.
"ఎవరికి భయపడి ఆంధ్రప్రదేశ్‌తో నీటి ఒప్పందం చేసుకున్నారు. ఎన్ని లక్షల కోట్లు తీసుకుని తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు. కేంద్రం మీద కేసీఆర్ యుద్ధం చేయటం కాదు.. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌పై యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ వేదికగానే ఆ యుద్ధం మొదలవనుంది. రానున్న హుజురాబాద్ ఎన్నికల్లో మళ్లీ జనాలకు మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు కేసీఆర్... కొత్త డ్రామాలు మొదలుపెట్టారు."- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: MAA Elections: 'మా' ఎన్నికల్లో బాలకృష్ణ?