- సామాజిక మాధ్యమాల్లో లభ్యమవుతున్న అశ్లీల దృశ్యాలు, చిత్రాలు(Pornographic Videos) ఇంటర్, డిగ్రీ విద్యార్థుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. కొందరు విద్యార్థులు వాటిని చూడకపోతే ఏదో పోగొట్టుకున్నవారిలా మారిపోతున్నారు. సమయం, అవకాశం దొరికినప్పుడల్లా వీక్షణకు మొగ్గుచూపుతుండడం గమనార్హం. రాత్రుళ్లు చదువుకుంటామంటూ ప్రత్యేక గదుల్లోకి వెళ్లి చూస్తున్నారు. అనుమానం రాకుండా చూసిన వీడియోలు, చిత్రాల(బ్రౌజింగ్ హిస్టరీ)ను తొలగిస్తున్నారు.
కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని విద్యార్థులతో ‘షి’ బృందాలు ఇటీవల మాట్లాడగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. చదువే లోకంగా ఉంటున్న విద్యార్థులను మినహాయిస్తే చాలామంది సామాజిక మాధ్యమాల్లో అశ్లీలాన్ని వీక్షిస్తున్నారని పేర్కొన్నారు.
తల్లిదండ్రులూ గమనించండి
పక్కదారి పడుతున్న యువకులను కట్టడి చేయాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులూ బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు గమనిస్తే తప్ప అలాంటి యువకులు సన్మార్గంలో నడవలేరని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు టీనేజర్లతో అనుబంధాలు తగ్గుతున్నాయని గుర్తించారు.
చదువుకుంటున్నామంటూ పడక గది తలుపులు వేసుకుని కూర్చునే పిల్లల వద్దకు అప్పుడప్పుడు తల్లి లేదా తండ్రి వెళ్లి చూస్తే తప్పుడు మార్గం వైపు మళ్లకుండా చాలావరకు నివారించవచ్చు.
తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరే ఉండే విద్యార్థుల్లో 70 శాతం మంది విద్య సంబంధిత ఖర్చులున్నాయంటూ రూ.వేలు తీసుకొని సహ విద్యార్థులతో కలిసి విందుల్లో పాల్గొంటున్నారు. ఆ డబ్బు చదువుకే వెచ్చిస్తున్నారా? అని పరిశీలించాలి.
ఆటలు ఆడించండి
అశ్లీల వీడియోలు చూస్తున్న వారిలో 90 శాతం మందితో పోలీసులు మాట్లాడారు. చదువు తర్వాత వారికి ఆటలు, తదితర వ్యాపకాలు లేవు. ఫలితంగా ఇంటర్ స్థాయిలోనే కొందరు సిగరెట్లు, మద్యం తాగడం వంటి దురలవాట్లకు మళ్లుతున్నారని గుర్తించారు. ఇంట్లో కొద్దిసేపు ఉండడం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఛాయ్ దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద గంటల పాటు కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆటల వైపు మళ్లించడం, బుర్ర పదునెక్కేందుకు చదరంగం, ప్రహేళికలు(పజిల్స్) నేర్పించడం చేస్తే తీరు మార్చవచ్ఛు.
45 శాతం: స్మార్ట్‌ఫోన్లు ఉన్న విద్యార్థుల్లో అశ్లీలం చూసే అలవాటు ఉన్నవారు.
2-3 గంటలు: రోజులో ఆధునిక చరవాణులతో గడుపుతున్న సమయం.
20 శాతం: కళాశాలల నుంచి ఇంటికొచ్చినా ఆ ప్రభావంలో ఉండేవారు.
30-60 నిమిషాలు: తల్లిదండ్రులు గమనించకుండా స్నానపు గదుల్లో ఉంటున్న సమయం.