పాలనా సౌలభ్యం, మెరుగైన పరిపాలనే లక్ష్యంగా ఏర్పాటైన నూతన పురపాలికలు...ఇన్‌ఛార్జి కమిషనర్లతో సతమతమవుతున్నాయి. ఇతర శాఖలు నిర్వహించే అధికారులే కమిషనర్లుగా ఉండటంతో పాలన కుంటుపడుతోంది. సగానికిపైగా కొత్త మున్సిపాలిటీల్లో 16 నెలలుగా ఇన్‌ఛార్జిలే పాలనా వ్యవహారాలు చూస్తుండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
గ్రామీణాభివృద్ధిలో కీలకంగా ఉండే ఎంపీడీవోలు చాలా చోట్ల కమిషనర్లుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటు సొంత శాఖ విధులకు న్యాయం చేయలేక అటు పురపాలక సంఘాలపై దృష్టిసారించలేక ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, అనుమతులు, ధ్రువపత్రాల జారీ సహా అనేకాంశాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎంపీడీవోలే అధికం
రాష్ట్రంలో కొత్తగా 7 నగరపాలక సంస్థలు, 61 పురపాలక సంఘాలు ఏర్పాటయ్యాయి. 30కి పైగా మున్సిపాలిటీల్లో ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, పంచాయతీ అధికారులు, ఇంజినీర్లు.. కమిషనర్‌లుగా ఉన్నారు. రెండు మండలాలకు ఇన్‌ఛార్జిలుగా ఉన్న ఎంపీడీవోలు సైతం కమిషనర్లుగా వ్యవహరిస్తున్నారు.
వనపర్తి జిల్లాలో ఆత్మకూరు పురపాలక కమిషనర్.. ఆత్మకూరు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగానూ వ్యవహరిస్తున్నారు. ఆ అధికారికే మరో పురపాలిక బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత శాఖ విధులకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా 17 పురపాలక సంఘాలు ఏర్పాటయ్యాయి. వీటిలో పదింటికి ఎంపీడీవోలు, ఇతర అధికారులు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాలతో పాటు అంతకుముందున్న వాటికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. పోస్టులనూ కేటాయించలేదు. కొత్త మున్సిపాలిటీల్లో.. గ్రామ పంచాయతీలో ఉన్న ఉద్యోగులే పురపాలక ఉద్యోగులుగాను కొనసాగుతున్నారు. ఒకరిద్దరు ఉద్యోగులు మినహా మిగిలిన వారు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.
పాలన సౌలభ్యం కోసం పురపాలికలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. నిధులు, పోస్టుల కేటాయింపులో శ్రద్ధ కనబరచలేదు. ఫలితంగా పాలన గాడితప్పింది. పారిశుద్ధ్యం, నీటి సరఫరా సహా అన్నింటా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతోంది.
ఇవీచూడండి: హైకోర్టు తీర్పు తర్వాతే... ఆర్టీసీపై తుది నిర్ణయం