- ఇదీ ఏపీలోని డోనేకల్లు ఎత్తిపోతల పథకం పరిస్థితి. కరవు పీడిత ప్రాంతంలోని 1,000 ఎకరాలకు సాగునీరు అందించి, జీవం పోయడానికి దీన్ని 1989లో ప్రారంభించారు. నిర్మాణంలో లోపాలు, నిర్వహణలో చొరవ లేకపోవడంతో అదే ఏడాది మూతపడింది. ఎత్తిపోతల పునరుద్ధరణకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. కనీసం ఎంత ఖర్చు అవుతుందో కూడా అంచనా వేయలేదు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం కొరిశీల ఎత్తిపోతల పథకం మోటార్లు రెండేళ్ల నుంచి పని చేయడం లేదు. కేవలం రూ.60 వేలు ఖర్చు చేస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు. ఆ కొద్దిపాటి నిధులనూ వెచ్చించే నాథులే లేరు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ముకుందాపురం ఎత్తిపోతలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తే మళ్లీ వినియోగంలోకి వస్తుంది. దీని పరిస్థితీ అంతే.. ఎన్టీఆర్ జిల్లాలో వేదాద్రి ఎత్తిపోతల ఉంది. దీని పరిధిలోని 16,500 ఎకరాలకు సాగునీరు అందడంలేదు. దీన్ని బాగు చేసేందుకు రూ.7 కోట్లతో ప్రతిపాదనలున్నా ఆ తదుపరి అడుగు పడలేదు.
ఏపీలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా వీటి నిర్వహణ, మరమ్మతుల్లో రైతులను భాగస్వాములను చేయాల్సిన బృహత్తర బాధ్యతను ప్రభుత్వ వ్యవస్థలూ వదిలేశాయి. ఆయా పథకాలను ‘ఈనాడు యంత్రాంగం’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రధానంగా నిధులు, నిర్వహణ లేమితో సమస్యలు ఎదుర్కొంటున్న తీరు వెల్లడైంది....
- బాపట్ల జిల్లా కర్లపాలెంలో నల్లమడ వాగుపై రూ.కోటి వ్యయంతో 2013లో ఎత్తిపోతల నిర్మించారు. నిర్వహణ కరవై 500 ఎకరాలకు నీరందడంలేదు. కొత్తగా 200 మీటర్ల పొడవున పైపులైను వేస్తే అది అందుబాటులోకి వస్తుంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండలో రూ.1.17 కోట్లతో 2016లో నిర్మించిన ఎత్తిపోతలకు నీటి తీరువా వసూలవక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఏలూరు జిల్లా గూటాల ఎత్తిపోతల, గణపవరం మండలం యనమదుర్రు డ్రెయిన్‌పై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకు నీటి తీరువా సరిగా వసూలు కావడం లేదు. యనమదుర్రులో పాడైన ఒక మోటారును బాగు చేయించే వారే లేరు. వీటి విద్యుత్తు బకాయిలను ప్రభుత్వమే భరిస్తుందని అప్పట్లో అధికారులు చెప్పినా ప్రస్తుతం రైతులే చెల్లించుకోవాల్సి ఉందంటున్నారు. గూటాల ఎత్తిపోతల మోటార్ల మరమ్మతులకు రూ.3.29 కోట్లకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. - ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో 4 పంపులు పాడైతే మరమ్మతులకు రూ.లక్ష ఖర్చయింది. నీటి తీరువా పెంచితే రైతులు ఇబ్బందులు పడుతున్నారని కమిటీ అధ్యక్షుడు గాదె కొండారెడ్డి తెలిపారు.
- అనకాపల్లి జిల్లా చోడవరం మద్దుర్తి ఎత్తిపోతలను ఆపరేటర్ లేకపోవడం, రైతులకు-అధికారులకు మధ్య సమన్వయ లోపంతో వదిలేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఏడింటికి 5 పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. సెరిబయలు-1, 2 ఎత్తిపోతల పథకాల కోసం ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు. అరకులోయ మండలం కొత్తవలస పాతాలగెడ్డ, అనకాపల్లి జిల్లా వెంకుపాలెం ఎత్తిపోతల పథకాలు వినియోగంలో లేకున్నా దస్త్రాల్లో పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు.
- శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురం, కుతుమ, బెంకిలి, రుషికుడ్డ, పొత్రఖండ పథకాలు తిత్లి తుపాను సమయంలో దెబ్బతిన్నాయి. ఈదుపురం (1,200 ఎకరాలు) పథకాన్ని రూ.50 లక్షలు వెచ్చించి వేరే చోటకు తరలించాలని అధికారులు ప్రతిపాదించారు. మిగిలిన 4 పథకాలకు రూ.4 లక్షల చొప్పున వెచ్చించి బాగు చేస్తే సరిపోతుంది.
- ఉమ్మడి విజయనగరం జిల్లాలో పని చేయని పథకాలు అధికారికంగా రెండేనని చెబుతున్నా నిజానికి పది పని చేయడం లేదు.
- అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెదగెద్దాడలోని పథకం మోటార్లు పని చేయక నాలుగేళ్లుగా మూలనపడింది. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం ఎత్తిపోతల-1ను 2004లో రూ.83 లక్షలతో ఏర్పాటు చేశారు. మోటార్లు తరచూ పాడవడంతో నిర్దేశించిన పూర్తి ఆయకట్టుకు నీరందడం లేదు.
వైయస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని శ్రీరామ ఎత్తిపోతల పథకం 2016లో రూ.33.82 కోట్లతో నిర్మించి ప్రారంభించారు. ఒంటిమిట్ట చెరువు నుంచి 1,014 ఎకరాలకు నీటిని ఎత్తిపోయాలి. నిర్వహణకు రూ.19 లక్షలు వెచ్చించలేక మూలనపడింది. విద్యుత్తు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పైపులను బాగు చేయాల్సి ఉంది.
నిధుల లేమి
* పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం ముకుందాపురం వద్ద ఎత్తిపోతలలో రెండు మోటార్లు కాలిపోయాయి, భూగర్భ పైపులైన్లు పగిలిపోయాయి. వీటికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తే చాలు.
*ఎన్టీఆర్ జిల్లాలో పాడైన ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.20 కోట్లు అవసరం.
* ఏలూరు జిల్లా గూటాల ఎత్తిపోతలలో మోటార్ల మరమ్మతులకు రూ.3.29 కోట్లకు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది.
* బాపట్ల జిల్లా ఓగేరు వాగుపై ఉన్న ఇనగల్లు ఎత్తిపోతల మరమ్మతుకు రూ.6 కోట్లు అవసరం.
నీటి సమస్యలు
* నీటి వనరులు లేకపోవడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వంశధార, మహేంద్ర తనయ, బహుదా, బీలబట్టి తదితర 47 పథకాల కింది 35,400 ఎకరాలకు సాగు నీరందడం లేదు.
* ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని పాలారుపై ఉన్న అయిదు ఎత్తిపోతల పథకాలు నీళ్లు లేక పని చేయడం లేదు. మోటార్లు తుప్పు పట్టాయి.
* సత్యసాయి జిల్లా టి.సదుం ఎత్తిపోతల పథకానికి చెన్నరాయుని గుడి(సీజీ) ప్రాజెక్టు నుంచి పదేళ్లుగా నీరు సరిగా చేరడంలేదు.
విద్యుత్తు కష్టాలు
* ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 47 పథకాలుంటే వాటిలో 41 పథకాలకు ప్రత్యేక ఫీడర్లున్నాయి. మిగిలిన వాటికి ఎల్‌టీ లైన్ల ద్వారా 9 గంటల విద్యుత్తు వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు లోవోల్టేజీతో వీటి మోటార్లు పాడవుతున్నాయి.
* ఏలూరు జిల్లా గణపవరం మండలంలోని 2 ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు బకాయిలు ఉన్నాయి. విద్యుత్తు బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని అప్పట్లో చెప్పిన అధికారులు... ఇప్పుడు రైతులే చెల్లించాలంటున్నారు.
ఇవీ ఆదర్శ పథకాలు
రైతుల భాగస్వామ్యం, అధికారుల సమన్వయంతో ఆదర్శంగా పని చేస్తున్న ఎత్తిపోతలు ‘ఈనాడు’ పరిశీలనలో కనిపించాయి. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని వీరన్నపాలెం దుర్గా ఎత్తిపోతల పథకం ఇలాంటిదే. ఏటా శ్రీరామనవమి నాడు ఆయకట్టు రైతులు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆదాయ, వ్యయాలు లెక్కించుకుని, కొత్త కమిటీని ఎన్నుకుంటారు.
* ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం కనపర్తి ఎత్తిపోతల ఆదర్శంగా పనిచేస్తోంది. ఆరు గ్రామాలకు చెందిన 2,140 మంది రైతులు దీన్ని జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. రెండుసార్లు ఉత్తమ పథకంగా ఎంపికైంది.
* అనంతపురం జిల్లా రామాపురం, కలేకుర్తి, కళ్లదేవనహళ్లి, సింగనకల్లు, బొళ్లనగుడ్డం ఎత్తిపోతలను రైతులే భేషుగ్గా నిర్వహించుకుంటున్నారు.
* ఎన్టీఆర్ జిల్లాలో కొన్నిచోట్ల ఎకరాకు రూ.వెయ్యి నీటి తీరువా వసూలు చేస్తూ ఎత్తిపోతల పథకాలను రైతులే నిర్వహించుకుంటున్నారు. ఇద్దరు ఆపరేటర్లకు ఒకరిని నియమించుకుని నడిపిస్తున్నారు. విద్యుత్తు బకాయిలు పెండింగులో ఉన్నాయి
ఏపీలో ఎత్తిపోతల పథకాలపై అధికారిక గణాంకాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదు. మూలనపడ్డ కొన్ని పథకాలను అధికారులు పని చేస్తున్న కేటగిరీలో చేర్చిన వైనమూ కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో దాదాపు 250కి పైగా పథకాలు పని చేయడం లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 10 ఎత్తిపోతల పథకాలకు సమస్యలున్నాయి. 4,300 ఎకరాల ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళంలో 7 వేల ఎకరాలకు సమస్యలున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3,400 ఎకరాలకు, ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి 50వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఒక్కో ఉమ్మడి జిల్లాలో 5వేల ఎకరాల లోపు ఆయకట్టున్న ఎత్తిపోతలు పని చేయడంలేదు.
ఇదీ చదవండి: CM KCR Review: పల్లె, పట్టణప్రగతి కార్యాచరణపై ఇవాళ కీలక సమావేశం