సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో శ్రీలత తన రెండు నెలల బిడ్డను ఊయలలో పడుకోబెట్టింది. ఓ కోతుల గుంపు ఇంట్లోకి చొరబడటంతో ఆమె భయంతో పరుగెత్తింది. ఈ క్రమంలో జారిపడి శ్రీలత తలకు గాయమై అక్కడికక్కడే మరణించింది. ఈమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లకు చెందిన రవళి దుస్తులు ఆరవేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. మీదికొచ్చిన కోతుల గుంపును తప్పించుకునే ప్రయత్నంలో డాబాపై నుంచి దూకడంతో ఆమె కాలు విరిగింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల ఎజెండాగా మారిన కోతుల సమస్య పరిష్కారం.. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాంశం అవుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం.. పచ్చదనం తగ్గడం. ఆహారం దొరక్కపోవడం. అడవిలో మేడి, తునికి వంటి పండ్ల చెట్లు తగ్గిపోతుండటం కోతులు ఊళ్లలోకి రావడానికి కారణమని పలువురు చెబుతున్నారు.
గానుగుపహాడ్‌లో టమాట సాగు కనుమరుగు
జనగామ మండలం గానుగుపహాడ్‌లో 2016 వరకు 400 ఎకరాల్లో టమాట సాగœయ్యేది. కిలో ధర 50 పైసలకు పడిపోయినప్పుడు కూడా ఇక్కడి రైతులు సాగును విడిచిపెట్టలేదు. ఇప్పుడదే ఊరిలో పట్టుమని పదెకరాలకు మించి టమాటాలు పండించట్లేదు. కారణం.. కోతుల బెడద.
తాడ్వాయిలో కోతుల యుద్ధం
ఇతర ప్రాంతాల్లో పట్టుకున్న కోతుల్ని ములుగు జిల్లా తాడ్వాయి సమీప అడవిలో వదిలేస్తున్నారు. అరణ్యంలో ఉండలేని కోతులు గ్రామంపై పడుతున్నాయి. ప్రతి నెలా ఓ కొత్త మంద వస్తుంటుంది. దీంతో వాటి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ గ్రామంలో కోతులు కరిచిన వారు 250 మంది వరకు ఉంటారు.
అలా పట్టేస్తున్నారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచి బి.యాదగిరిరెడ్డి కోతుల సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం కొద్దిరోజులుగా 1600 కోతుల్ని పట్టించారు. ఇప్పటికే రూ.2.40 లక్షలు ఖర్చు చేశారు. ఇదే మండలం మునిగలవీడు గ్రామంలోనూ ఇళ్లలోకి వచ్చి కోతులు దండయాత్ర చేస్తున్నాయి. దొరికింది ఎత్తుకెళ్తున్నాయి. గుంపులుగా వచ్చి బెదిరించి మరీ దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు శూన్యమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
చించోలిలో పునరావాస కేంద్రం
ఓ కోతి జీవితకాలం సుమారు 20 ఏళ్లు. ఒక్కో ఆడ మర్కటం 10, 12 పిల్లలకు జన్మనిస్తుంది. తెలంగాణలో కోతుల సంఖ్యకు లెక్కలు లేవు. ఈసమస్య పరిష్కారానికి హరితహారం, మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మొక్కలు చెట్లుగా పెరగడానికి సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నిర్మల్‌జిల్లా చించోలిలో ఇటీవల అటవీశాఖ కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
కొత్తగూడెంలో రూ.లక్షల ఖర్చు
కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట, చంద్రుగొండ, దమ్మపేట, దుమ్ముగూడెం, జూలూరుపాడు, ములకలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పత్తి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. వరి కంకులను తెంపేస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 437 మంది కోతుల దాడిలో గాయపడ్డారు. వీటిని పట్టుకునేందుకు కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు రూ.5 లక్షలు, రూ.3.80 లక్షల చొప్పున వ్యయం చేశాయి.
సమస్య తీవ్రం
* పలు జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 3 వేల కుటుంబాలున్నాయి. ఇంటికి రూ.50 చొప్పున రూ.1.50 లక్షలు సేకరించి గ్రామాభివృద్ధి కమిటీతో ఈ మర్కటాల్ని పట్టిస్తున్నారు. సమస్య పునరావృతమైనపుడుప్రజలు చందాలువేసుకుంటున్నారు.
* హైదరాబాద్‌కు సమీపంలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో కూరగాయల సాగు ఎక్కువ. కోతుల బెడదను తప్పించుకునేందుకు గూడూరులో రైతులు సొంత ఖర్చుతో బోను తయారుచేశారు. కోతుల్ని అడవిలో వదిలిపెట్టినా తిరిగి వస్తున్నాయి.
* మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ మండలంలో 2018లో 503 మంది, 2019లో 598 మంది కోతుల దాడులకు గురయ్యారు. వాటిని భయపెట్టడానికి పులి బొమ్మలను వాడుతున్నారు.
* వికారాబాద్ జిల్లాలో పంటల్ని కాపాడుకునేందుకు రైతులు దీపావళి బాంబులు పేలుస్తున్నారు. చేను చుట్టూ వలలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
* మహబూబాబాద్ మండలం ముడుపుగల్‌లో ఇళ్లపై ముళ్లకంపలు కనిపిస్తాయి. గ్రామంలో 30 మందికి పైగా గాయపడ్డారు.
అటవీశాఖ విధానం మారాలి
ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నది మనిషే. అరణ్యంలో ఉన్న చెట్ల పండ్లను వన్యప్రాణులు తిని గింజలు పారేయడటంతో అవే మొక్కలుగా, వృక్షాలుగా పెరుగుతున్నాయి. వాటి ఫలసాయాన్ని మొత్తం మనమే తినేస్తున్నాం. ఇక మర్కటాలకు ఆహారం ఎలా దొరుకుతుంది? అటవీశాఖ విధానం మారాలి. అడవిలో చెట్ల పండ్లు, కాయల్లో వన్యప్రాణులకు వాటా దక్కేలా చూడాలి. కోతులకు వేసెక్టమీ ఆపరేషన్లతో ఫలితం నామమాత్రమే.
- తులసీరావు, జీవవైవిధ్య నిపుణుడు