ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైకాపా మంత్రులు లోకేశ్‌ని లక్ష్యంగా చేసుకుని దాడికి విశ్వ ప్రయత్నం చేశారని తెదేపా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. మండలిలో బుధవారం మంత్రులు వాడిన భాష బజారులో ఎవరు మాట్లాడరని... వారు వాడిన భాష ఉచ్ఛరించడానికి సిగ్గుగా ఉందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేయండి అని యనమల చెప్పినా.. మంత్రులు వినలేదని తెలిపారు. మండలి వీడియో బయటపెట్టాలని రవిచంద్ర డిమాండ్‌చేశారు.
తాము మంత్రుల దగ్గరికి వెళ్ళామా?. లోకేష్ దగ్గరికి మంత్రులు వచ్చారా? తెలియాలంటే వీడియోలు బయట పెట్టాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. లోకేశ్ తన ఫోన్లో మెసేజ్‌లు చూస్తుంటే.. ఫోటోలు తీస్తున్నాడని ఆయనపై దాడికి వచ్చారని ఆరోపించారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులకు మాత్రమే తెదేపా వ్యతిరేకమని, మిగతా ఏ బిల్లులను తాము వ్యతిరేకించలేదని స్పష్టంచేశారు. ఇంట్లో ఉండే తల్లుల గురించి... ఆడవారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మంత్రులు కాదా? అని రవిచంద్ర ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం- ఆ 18 మంది ఎవరు?