Raghunandan Rao Comments: విద్యుత్ కోతలతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రగల్బాలు పలికిందని.. మూడు రోజులుగా పల్లెల్లో 3 నుంచి 5 గంటలు మాత్రమే ఇస్తున్నారని నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రను మంత్రి కేటీఆర్ అవమానించటం సిగ్గు చేటన్నారు. అసెంబ్లీ సాక్షిగా నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్.. 30 రోజులు దాటినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
"సీఎంతో పాటు ఏ మంత్రి మాట్లాడినా దేశానికి తెరాస దిక్సూచి అని చెబుతున్నారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కొనేందుకు నిధులు లేవా? ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇలా చేస్తోందా? అనేది తెలియడం లేదు. పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో కరెంట్ కోతలతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మినహా ఇతర నియోజకవర్గాల్లో 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపించగలరా? 3 ఫేస్ ద్వారా ఎన్ని నియోజకవర్గాలకు విద్యుత్ అందించారో చెప్పాలి. ఇవన్నీ కేసీఆర్‌కు తెలిసే జరుగుతున్నాయని భావిస్తున్నా. మరో 15 రోజులు 24 గంటలపాటు కరెంట్ ఇస్తే 100 శాతం దిగుబడి వస్తుంది. రైతులను వంచించొద్దు. రాష్ట్రంలో డిస్కంలకు ప్రభుత్వం రూ.17,202 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు చెప్పింది నిజం కాదా? ఎందుకు బకాయిలు పడ్డారో కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెబుతారా? ఆ మూడు నియోజకవర్గాలకు అందించినట్లే రాష్ట్రమంతా విద్యుత్ అందించాలి." - రఘునందన్‌రావు, ఎమ్మెల్యే
ఇదీ చూడండి: