Raghunandan Rao Challenges Prashanth reddy : తెలంగాణ శాసనసభలో భాజపా ఎమ్మెల్యేలపై వివక్ష చూపెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం దారుణమన్నారు. శాసనసభ సమావేశాలు మరీ రెండ్రోజులే నిర్వహించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై.. నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సభాపతి బీఏసీ నిబంధనలు పాటించడం లేదని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.
Dubbaka MLA challenges Minister Prashanth Reddy : 'మాకు మూడ్రోజులు మాట్లాడే అవకాశం లభిస్తుందనుకున్నాం. కానీ మేం కుర్చీలు వెతుక్కునేలోపే ఆరు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడింది. బీఏసీ సమావేశానికి బీజేపీని కూడా పిలవాలని స్పీకర్‌ను కోరాం. గత ప్రభుత్వాలు సీపీఎం, లోక్‌సత్తా పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కరే ఉన్నా వారిని కూడా బీఏసీ భేటీకి పిలిచారు. ఈ విషయాన్ని కూడా స్పీకర్ వద్దకు తీసుకెళ్లాం. అయినా ఆయన మమ్మల్ని సమావేశానికి అనుమతించలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ భేటీకి ఆహ్వానిస్తారో సభాపతి చెప్పాలి. మీరు ఇచ్చే నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.' అని రఘునందన్ రావు అన్నారు.
మరమనిషి అనేది నిషిద్ధ పదమా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. భాజపా ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీలో వివక్ష జరుగుతోందని ఆరోపించారు. బల్లాలు ఎక్కి, మైకులు విసిరి, గవర్నర్ కుర్చీనే తన్నినప్పుడు ఈ సభా సంప్రదాయం ఎక్కడికి పోయిందని మంత్రి ప్రశాంత్ రెడ్డిని రఘునందన్ ప్రశ్నించారు. మరమనిషి అంటే సభా సంప్రదాయాలను అగౌరవపరిచినట్లా అని అడిగారు. అసెంబ్లీ సమావేశాలకు భాజపాను రానీయకుండా చేసేందుకు మంత్రులు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కాంగ్రెస్, మజ్లిస్ బీఏసీలో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. తెరాస, కాంగ్రెస్, మజ్లిస్ ఒక్కటేనని అన్నారు.
నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన రోజు స్పీకర్‌ను మరమనిషి చేసింది మంత్రి ప్రశాంత్ రెడ్డి అని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. శాసనసభ సమావేశాలకు సంబంధించిన నిబంధనల పుస్తకం తీసుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సిద్ధంగా ఉండమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సాంప్రదాయాలను రద్దు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.