రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాస పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమావ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామంటూ ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని... ప్రజలు మాత్రం తెరాస పార్టీ వైపే ఉన్నారని తెలిపారు. ఖైరతాబాద్‌లో ప్రభుత్వ పథకాలపై ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. జీవో నెం. 58, 59, నోటరీ పట్టాలు, నూతన రెవెన్యూ చట్టం విషయంలో ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటులను బస్తీ ప్రజలకు వివరించారు.
షాదీ ముబారక్ , కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. దసరా పండగ నుంచి రేషన్ షాపులలో సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో డబ్బులు తీసుకుంటూ... రావాల్సిన నిధులను ఇవ్వకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని... ఆ దిశగానే ముందుకు వెళ్తామని దానం స్పష్టం చేశారు.