కరోనా కట్టడికి అవసరమైన అత్యవసర మందుల తయారీని పెద్దఎత్తున పెంచాలని మంత్రి కేటీఆర్ ఔషధ పరిశ్రమలు, యజమానులను కోరారు. సోడియం హైపోక్లోరైట్, బ్లీచింగ్ పౌడర్, శానిటైజర్ల ఉత్పత్తి పెంపుపైనా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఔషధ ఉత్పత్తి, భారీ తయారీ పరిశ్రమ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఔషధ రంగాన్ని ప్రభుత్వం అత్యవసర సేవారంగంగా గుర్తించదన్న కేటీఆర్ కరోనా నివారణకు వాడే మందులను ఎక్కువగా అందించాలని కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉత్పత్తులను ప్రభుత్వానికి ఉచితంగా సరఫరా చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.
సిద్దిపేట కలెక్టరేట్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రాల నుంచి వచ్చిన వివరాలు సేకరించామని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ హోంకు తరలిస్తామన్నారు. మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు అందించాలని ఆదేశించారు. ప్రజలు గుంపులు గుంపులుగా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి వేల్పూర్‌లో అధికారులతో సమీక్షించారు. విదేశాల నుంచి వచ్చిన వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిరంతరం సేవలందిస్తున్న కానిస్టేబుల్, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించారు. విదేశాల నుంచి వచ్చి మహబూబాబాద్ క్వారంటైన్‌లో ఉన్న 115 మందిలో 70 మందిని డిశ్చార్జి చేశామని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. నిర్లక్ష్యం వల్లే విదేశాల్లో కరోనా బాధితులు పెరిగారని, సీఎం కేసీఆర్ ముందస్తు చర్యలతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి పట్టునే ఉండడం దేశానికి చేసిన సేవగా అభివర్ణించారు.
కరోనా బారినుంచి రాష్ట్రం బయటపడాలంటే.. ప్రజలంతా సహకరించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. జనగామలో పర్యటించిన ఎర్రబెల్లి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదన్న మంత్రి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం ప్రజలు అధికారులకు అందించాలన్నారు.
ఇదీ చూడండి: పరిమళించిన మానవత్వం.. అన్నార్థులకు చేయూత