దశాబ్దాలుగా వైద్య, విద్యా రంగాల్లో క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సేవలు ఎనలేనివని... పురపాలకమంత్రి కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో బిషప్‌లు, క్రైస్తవ పెద్దలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాను పుట్టింది కరీంనగర్ లోని మిషనరీ ఆస్పత్రిలోనేనని.... ఎక్కువగా చదువుకున్నది మిషనరీ పాఠశాలలోనేనని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామన్న మంత్రి... ఒక్కో విద్యార్థిపై లక్ష 20 వేలు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. క్రైస్తవులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. అభివృద్ధి సమగ్రంగా, సమ్మిళితంగా ఉండాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ మిషనరీ ఆస్పత్రులు సమర్థ పాత్ర పోషిస్తున్నాయన్నారు. మన దేశంలో అన్నీ ఉన్నప్పటికీ... ఏదో వెలితి కనిపిస్తోందన్న భావన యువతలో కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పాల్గొన్నారు.