భాజపా పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు చూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని... ఒకవేళ చూపించకుంటే భాజపా రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తమ పదవులకు రాజీనామా చేస్తారా అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్‌లోని దుబ్బ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని మంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెరాస కార్యకర్తలు చుస్తూ ఊరుకోరని మంత్రి హెచ్చరించారు.
ఒకవైపు కేంద్రంలోని భాజపా మంత్రులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రశంసిస్తుంటే... బండి సంజయ్, అరవింద్ అవివేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం కింద పనిచేసే నీతి ఆయోగ్ కుడా సీఎంను ప్రశంసించిందని మంత్రి గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారులో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను... భాజపా ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించండని మంత్రి సవాల్ విసిరారు.