హైదరాబాద్ నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్ టోకు చేపల మార్కెట్‌ను తాత్కాలికంగా ఆర్టీసీ బస్ భవన్ పక్కన ఖాళీ స్థలంలోకి మార్చనున్నట్టు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ, ఉన్నతాధికాలుతో సమీక్షించారు. కరోనా వ్యాప్తి కారణంగా ముషీరాబాద్ రెడ్‌జోన్ పరిధిలోకి వెళ్లింది. దీంతో కార్యకలాపాలు ఈ నెల 26 నుంచి బస్ భవన్ పక్కకి మార్చనున్నట్టు తెలిపారు.
వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేపలు ముషీరాబాద్ మార్కెట్‌కు తీసుకొస్తారని, రెడ్‌జోన్ పరిధిలో రావడం వల్ల మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితులు దృష్ట్యా ముషీరాబాద్ టోకు చేపల మార్కెట్‌ను తరలించి సువిశాలమైన అన్ని వసతులు కలిగిన స్థలంలో కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు, వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి: రేషన్ బియ్యం నాణ్యత పెంచాలి: ఉత్తమ్