బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప వ్యక్తని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో నేటి నుంచి ఈనెల 18 వరకు జరగనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వారోత్సవాలను మంత్రి ప్రారంభించారు.
గౌడ్ సామాజిక వర్గానికే కాక బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసిన ఘనత పాపన్నకే దక్కుతుందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సామాన్య కల్లు గీత కార్మికుని నుంచి దిల్లీ పాలకులను ఎదిరించిన స్థాయికి ఎదిగిన వీరుడని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాపన్న చరిత్రను నిర్లక్ష్యం చేశారని... తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నాటి చారిత్రక కట్టడాలను, కోటలను సంరక్షిస్తున్నట్లు తెలిపారు.
వాటిని పర్యాటక, పురావస్తు శాఖ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సర్దార్ జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో ఇప్పటికే చేర్చినట్లు తెలిపారు. ఈనెల 18న పాపన్న గౌడ్ జయంతిని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
ఇవీచూడండి: బైరామల్‌గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్