Srinivas Goud Review: ప్రభుత్వానికి వివిధ సంస్థల నుంచి రావాలసిన బకాయిల వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. లీజులు, రెవెన్యూ షేర్ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లీజు అగ్రిమెంట్ నియమ నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. లీజ్ డబ్బులు కట్టకపోవడానికి సరైన కారణాలు లేని ఎగవేత సంస్థలపై వెంటనే చట్ట ప్రకారం చర్యలతో పాటు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా నిలుపుదలపై సంబంధిత అధికారులకు లేఖలు రాయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బకాయిలతో ప్రభుత్వంపై భారం..
హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో తెలంగాణ పర్యాటక శాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేసినవారు ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లీజు, రెవెన్యూ షేర్‌ను కట్టకుండా వివిధ కారణాల చేత న్యాయస్థానాలను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకొని ప్రభుత్వ భూములలో కొనసాగుతున్నారని తేల్చారు. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి తద్వారా భారం పడుతోందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో టూరిజం ఎండీ మనోహర్, టూరిజం శాఖ జాయింట్ సెక్రటరీ కరోల్ రమేష్, శంకర్ రెడ్డి, న్యాయ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏఏ సంస్థ ఎంత బకాయి ఉందంటే..
సంస్థ | బకాయి(రూ.లో) |
ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ (నెక్లెస్‌రోడ్) | 27.45 కోట్లు |
జలవిహార్ | 6.51 కోట్లు |
స్నోవరల్డ్ | 15.01 కోట్లు |
ఎక్స్పో టెల్ హోటల్ | 15.13 కోట్లు |
దసపల్ల హోటల్ | 5.67 కోట్లు |
గోల్ఫ్ కోర్స్ (శామీర్‌పేట) | 5.58 కోట్లు |
ట్రిడెంట్ హోటల్ (మాదాపూర్) | 75.05 కోట్లు |