గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు. డిజిటల్ తరగతుల నిర్వహణ, ఏర్పాట్లు, ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై.. హైదరాబాద్ సంక్షేమ భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు.
డిజిటల్ తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయులు, అధికారులు మరింత శ్రద్థతో పనిచేయాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు ఉన్న విద్యార్థులు ఒక గ్రూపుగా, టీ-శాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులను మరో గ్రూపుగా గుర్తించి తరగతులు నిర్వహించాలని సూచించారు.
టీ-శాట్, దూరదర్శన్ ద్వారా తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అంతరాయం కలగకుండా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు.. విద్యుత్, టెలికాం అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. క్లాస్ అనంతరం ఫోన్లు చేసి సందేహాలు తీర్చాలని ఆదేశించారు.
గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఓక్స్ యాప్ ద్వారా లాక్డౌన్ నుంచే డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. ఏకలవ్య మోడల్ స్కూల్స్లో స్టెప్ యాప్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 24 నుంచి టీ-శాట్ ద్వారా మనటీవీలో పాఠాలు చెబుతున్నట్లు వివరించారు.
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు జూమ్ యాప్ ద్వారా రెగ్యులర్గా డిజిటల్ తరగతులు కొనసాగించామని తెలిపారు. నీట్, ఐఐటీ కోసం డిజిటల్ మాధ్యమంలో తరగతులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డిజిటల్ తరగతులుంటాయని, వారానికి నాలుగు రోజులు మాత్రమే వీటిని నిర్వహిస్తామని తెలిపారు. మిగిలిన రెండు రోజుల్లో.. ఉపాధ్యాయులు.. గ్రామాలు, తండాలకు వెళ్లి డిజిటల్ తరగతుల నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలిస్తారని చెప్పారు.
ఇవీచూడండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం