రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేస్తున్న పలు ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు హరీష్, ప్రతీక్ జైన్లు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అత్యవసర సేవలు, ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలు, ఉచిత బియ్యం పంపిణీ, పారిశుద్ధ్యం, మాస్కులు, శానిటైజేషన్ నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా 12 కిలోల ఉచిత బియ్యం, రూ. 1500 ఇస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రకటించారు. గచ్చిబౌలి క్వారంటైన్ కేంద్రంలో 57 మంది, రాజేంద్రనగర్లో 64మంది క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావొద్దని, వైరస్ తీవ్రత తగ్గాలంటే ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: పత్రికల ద్వారా కరోనా సోకదు