కొత్త రైళ్లు, మార్గాల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యను కోరారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బుల్లెట్ రైలును దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవేశపెట్టేందుకు యోచించాలని కోరారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో జీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రైల్వేకు సికింద్రాబాద్ డివిజన్ నుంచి అత్యధిక ఆదాయం వస్తున్నా ఆశించినంత అభివృద్ధి జరగడం లేదన్నారు. కొత్త లైన్ల నిర్మాణం, పాత మార్గాల విస్తరణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని మార్గాలకు రైళ్లను విస్తరించాలన్నారు. తమిళనాడు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైల్వే లైన్లు, స్టేషన్లు తక్కువగా ఉన్నాయన్నారు. రైళ్ల సంఖ్య కూడా పెరగాలన్నారు. రైల్వేకోచ్‌ల కర్మాగారం ప్రతిపాదనకు ఏళ్ల తరబడి కేంద్రం నుంచి సానుకూలత రావడంలేదని తెలిపారు. ఇప్పటికే భూమిని కేటాయించామని, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బుల్లెట్ రైలు వంటి వాటికి ఉత్తరాదినే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోందని అవి దక్షిణాదికి కూడా రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ వినతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్ ఆయనకు సూచించారు.
ఇదీచూడండి: మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు