ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు కొవిడ్ 19 బారిన పడి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. సంస్థ తరఫున బాధితులకు అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందించాలని ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చామన్నారు. ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి చర్యల్ని నిరంతరం పాటించినట్లయితే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని మంత్రి సూచించారు. బాధితులు ఎవరూ అధైర్య పడవద్దని, చికిత్స అందించడానికి గాంధీ ఆసుపత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్‌లో మెరుగైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులకు ధైర్యమే ముఖ్యమని, దిగులు చెందకుండా ప్రాథమిక దశలో తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
కరోనా బాధితులకు సంస్థ నిబంధనల ప్రకారం తగిన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంస్థ తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.