Minister Niranjan reddy: కేవలం వానాకాలంలో పత్తి సాగు అన్న ధోరణి నుంచి బయటకు వచ్చిన అమెరికా, బ్రెజిల్ అనుభవాల దృష్ట్యా.. ప్రత్యేకించి యాసంగి సీజన్‌లోనూ తెల్ల బంగారాన్ని పండించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో అధిక సాంద్రత విధానంలో ఈ పంట సాగును పెద్ద పెత్తున ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఓ రైతు యాసంగిలోనూ పత్తి పంట సాగు చేసి అద్భుతం విజయం సాధించారని పేర్కొన్నారు.
ఇటీవల అమెరికాలోని టెక్సాస్, ఆస్టినా వంటి ప్రాంతాల్లో పరిశోధన సంస్థలు, రైతుల క్షేత్రాల్లో స్వయంగా అధిక సాంద్రత పత్తి సాగుపై అధ్యయనం చేసి వచ్చిన నేపథ్యంలో.. త్వరలో ఈ అంశంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పత్తి పంట చేతికొచ్చే సమయానికి 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని... అదే తెలంగాణలో ఎందుకు పండదన్న ప్రశ్న ఉత్పన్నమైన తరణంలో రూపొందించిన నివేదికను సీఎంకు సమర్పించి అధికార ప్రకటన చేస్తామన్నారు.
రాష్ట్రంలో కోటి ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు, తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో... పత్తి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు వంటి పంటల విత్తనాలు ఇప్పుడిప్పుడే వేస్తున్నందున ఎక్కడా పెద్దగా పైర్లు దెబ్బతినలేదన్నారు. రైతుల సౌకర్యార్థం... అన్ని రకాల పంటల విత్తనాలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాలు వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: