జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురపాలకశాఖ తరపున స్వచ్చతా దినోత్సవంగా నిర్వహించనున్నట్టు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణాల్లో స్వచ్ఛతకి మరింత ప్రాధాన్యత ఇచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. స్వచ్ఛ పట్టణాలుగా తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మేయర్లు, పురపాలిక ఛైర్మన్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. విప్లవాత్మకమైన సంస్కరణ అయిన టీఎస్ బీపాస్‌కు శాసనసభ ఆమోదం లభించిందని, త్వరలోనే చట్టంగా మారనుందని... పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసి వస్తే ప్రజలకు అధ్భుతమైన సేవలు అందుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అక్టోబర్ రెండు నాటికి పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి పట్టణంలోనూ తడి-పొడి చెత్త సేకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగాలని... వ్యర్థాల నిర్వహణపై మరింతగా దృష్టి సారించాలని సూచించారు. పట్టణాల్లో కంపోస్టింగ్, డ్రైరిసోర్స్ కలెక్షన్ సెంటర్లు లేని చోట వచ్చే నెల 1 నాటికి పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ సరైన సమయంలో కనీస వేతనాలు అందేలా చూడాలని చెప్పారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్దేశించుకున్న మరుగుదొడ్ల నిర్మాణం అక్టోబర్ 2నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, పురపాలికల్లో వెయ్యికిపైగా నర్సరీల ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆస్తిపన్ను వసూలుకు సంబంధించి ప్రభుత్వం కల్పించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ కార్యక్రమాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు తెలిపిన మంత్రి కేటీఆర్... ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకునేలా చైతన్యం చేయాలన్నారు.