పరిశ్రమల కోసం భూములను తీసుకొని నిరుపయోగంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పరిశ్రమలశాఖపై నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పెట్టుబడులు తెస్తున్నామని... అయితే కంపెనీలు కూడా ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి తెలిపారు. నిర్ణీత గడువు లోపు కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
ఒకే చోట సమగ్ర సమాచారం
ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పేరుతో మార్పిడి చేసుకొని కార్యకలాపాలు ప్రారంభం కానీ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట చేర్చి బ్లూబుక్ తయారు చేయాలని తెలిపారు. అన్ని పరిశ్రమల సమగ్ర సమాచారం అందులో ఉండేలా చూడాలని చెప్పారు. పరిశ్రమల సమగ్ర వివరాలు, కంపెనీల ప్రాథమిక సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.
విస్తరించండి
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి... కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన అంశంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.