రాష్ట్రంలో ఎక్కడా అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వస్తే చీకటవుతుందని చేసిన దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ విద్యుత్ ఉత్పత్తిని సాధించామని స్పష్టం చేశారు. పారిశ్రామికవాడల్లో కూడా మూడు షిఫ్టుల్లో విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త... ఇప్పుడు పోతే వార్త అన్న స్థాయికి తీసుకొచ్చామని ఛలోక్తి విసిరారు.
గతంలో హైదరాబాద్‌లో 15 రోజులకోసారి మంచినీరు వచ్చే దుస్థితి ఉండేదని... కేసీఆర్ సీఎం అయ్యాక వాయువేగంతో మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. నగర శివార్లలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఏ సీఎం కూడా నగర తాగునీటి అవసరాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదని తెలిపిన కేటీఆర్... నగరంలో 90 శాతం తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు.