హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర కుటుంబ సంక్షేమ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలోని బయోటెక్ కంపెనీలు ప్రతిఏటా ఆరు బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని మంత్రి వివరించారు. ప్రపంచం మొత్తం వాక్సిన్‌లలో మూడో వంతు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోనే తయారవుతున్నాయని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.
డ్రగ్ లేబరేటరీ..
దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లు తయారుచేస్తున్న జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబొరేటరీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. దేశంలో వ్యాక్సిన్‌ల తయారీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ లేబరేటరీ హిమాచల్‌ప్రదేశ్ కసౌలిలో ఉందన్న కేటీఆర్.. ప్రతిసారి అక్కడకు వ్యాక్సిన్లను పంపి పరీక్షించడం, సర్టిఫికేషన్ పొందడానికి హైదరాబాద్ కంపెనీలకు చాలా సమయం పడుతోందన్నారు.
వ్యాక్సిన్ తయారీ రంగానికి ఎంతో మేలు..
కోల్‌కతా, ముంబయి, చెన్నై, కర్నాల్‌లో మాత్రమే ఉన్న ప్రభుత్వ మెడికల్ స్టోర్.. డిపోను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాలని మంత్రి లేఖలో కేంద్రాన్ని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో డాటా మానిటరింగ్, ట్రాకింగ్ సిస్టం వంటి సౌకర్యాలతో డిపో ఏర్పాటు చేస్తే ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలు, భారత వ్యాక్సిన్ తయారీ రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. రెండు విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసాన్ని మంత్రి లేఖలో వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: నవకల్పన సూచీలో తెలంగాణకు 4వ స్థానం