కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి నిలువనీడ లేక రహదారి కల్వర్టు కింద తలదాచుకుంటున్న భార్యాభర్తలకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బేగంపేట పోలీసులు జీవనోపాధి కల్పించారు. బేగంపేట బస్తీకి చెందిన డోకుల కృష్ణారావు, సరిత భార్యాభర్తలు. కృష్ణారావు స్థానిక నేషనల్ స్కూల్‌లో డ్రైవర్‌గా పనిచేసేవారు. కొవిడ్ వ్యాప్తితో పాఠశాల మూతపడటంతో ఆయన ఉద్యోగం పోయింది. అద్దెకూడా చెల్లించలేకపోవడంతో ఇంటి యజమాని ఈ నెల 19న వారిని ఖాళీ చేయించడంతో ఆ దంపతులిద్దరూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని చిలకలగూడ చౌరస్తా కల్వర్టు కింద తలదాచుకుంటున్నారు.
ఇటీవల అటుగా వెళ్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి వారి దయనీయ పరిస్థితికి చలించి గాంధీనగర్‌లోని ఫతేదార్ భవనానికి తరలించి వసతి కల్పించారు. అనంతరం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ స్పందించి భార్యభర్తలకు రక్షణ కల్పించాలని సీపీ అంజనీకుమార్, ఉత్తరమండలం డీసీపీకి సూచించారు. దీంతో వారికి బేగంపేట పాత విమానాశ్రయం సమీపంలోని కార్గో కన్‌స్ట్రక్షన్స్‌లో కృష్ణారావుకు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించారు. ఆయన భార్య సరితకూ స్వీపర్‌గా పని ఇప్పించారు.
- ఇదీ చదవండి : ఆంక్షలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్