దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రజాబలం లేకే భాజపా అనేక డ్రామాలకు పాల్పడుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దుయ్యబట్టారు. గోబెల్స్‌కే పాఠాలు చెప్పేలా దుష్ప్రచారం చేస్తున్న కమలం నేతలు రోజుకో నాటకమాడుతున్నారని విమర్శించారు. ఈ పాచికలన్నీ పారకపోవడం వల్ల ఆఖరి ప్రయత్నంగా మరో నీచ ప్రయత్నానికి వ్యూహా రచన చేశారని మండిపడ్డారు. భాజపా కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్య ఘటన ఆధారంగా సోమవారం నాడు హైదరాబాద్‌లో భారీ ఎత్తున అల్లర్లు, హింసకు పాల్పడేలా వ్యూహరచన చేశారని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో భాజపా కుట్రలను తిప్పికొట్టేలా శాంతిభద్రతలను కాపాడాలని కోరుతూ ప్రధాన ఎన్నికల సంఘానికి లేఖరాసినట్లు కేటీఆర్ తెలిపారు.
ప్రజలే బుద్ధి చెప్తారు
భాజపా నేతల కుట్రలను ఉక్కుపాదంతో అణిచేయాలని తెరాస తరఫున ఆయన డిమాండ్ చేశారు. భాజపా అనైతిక రాజకీయాలను దుబ్బాక ప్రజలు గమనిస్తున్నారని... అందుకు తగిన రీతిలో బుద్ధిచెప్పడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోండి
భాజపా కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని తెరాస ప్రజాప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్ రెడ్డిని కోరింది. ఈ మేరకు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్ పోలీసు బాస్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత