నూతన పురపాలక చట్టాన్ని క్షుణ్ణంగా చదువుకుని రంగంలోకి దిగాలని కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అవినీతి రహిత సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ బాటలో నడవాలన్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నాటుకున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్‌లు, కార్పొరేషన్ మేయర్లతో సమావేశమయ్యారు. జడ్పీల్లో నూటికి నూరు శాతం సీట్లు సాధించి దేశంలోనే ఓ చరిత్ర సృష్టించామన్న మంత్రి... మున్సిపల్ ఎన్నికల్లో మెుత్తం 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 122 పురపాలక, నగరపాలక సంఘాల్లో విజయం సాధించడం మరో చరిత్రగా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు శత విధాల ప్రయత్నించాయని దుయ్యబట్టారు.
ఉత్తమ్ ప్రిపేర్ కాలేదన్నారు..
ఆనాడు అసెంబ్లీలో ఉత్తమ్ తాను ప్రిపేర్ అయి రాలేదన్నారని... ఎన్నికలకు కూడా కాంగ్రెస్ సిద్ధం కాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో తెరాస విజయాన్ని అపహాస్యం చేస్తూ కొందరు కాంగ్రెస్, భాజపా నేతలు మాట్లాడుతున్నారని, ఇది ఓట్లేసిన ప్రజలను అవమానపర్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలు తాము పట్టించుకోమని, మీరు పట్టించుకోవద్దని మంత్రి మేయర్లు, ఛైర్మన్‌లకు సూచించారు.
సంవత్సరానికి 3 వేల కోట్ల రూపాయలకు పైగా మున్సిపాలిటీలకు నిధులు వస్తాయని, ఇక పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గెలవగానే అహంకారం తలకెక్కొద్దని సూచించారు. తెలంగాణను మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్తో కలిసి నడవాలని కోరారు. నిధులతో పాటు మీ విధులను మున్సిపల్ చట్టంలో నిర్వచించామని చెప్పారు. ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి, పారదర్శక సేవలే విధానంగా ఉండాలని ఉద్భోదించారు. అవినీతికి దూరంగా ఉండాలని, తప్పు చేస్తే పదవులు ఊడుతాయని వారిని హెచ్చరించారు.
ఎంబీసీలకు అవకాశం కల్పించాం..
57 శాతం మహిళలకు మున్సిపల్ పీఠాల్లో అవకాశమిచ్చామని, ఏడు శాతం ఎక్కువ ఇచ్చి మహిళా సాధికారికతకు పెద్ద పీట వేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. 108 పోస్టులను బలహీనవర్గాలకు, 58శాతం బీసీలకు కేటాయించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఏనాడు రాజకీయంగా ప్రాతినిధ్యం దక్కని ఎంబీసీలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జనరల్ సీట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించిన ఏకైక పార్టీ తెరాస అని ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
దేశంలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీలుగా తెలంగాణ పట్టణాలు మారడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇంతటి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఇవీచూడండి: 'కేటీఆర్... మా వార్షిక పెట్టుబడుల సదస్సుకు రండి'