ప్రతిపక్షాలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బిన్‌లాడెన్, బాబర్, హిందూ, ముస్లిం లాంటి అంశాలు ప్రస్తావిస్తూ... విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఆరేళ్లలో పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లిస్తే... కేవలం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే తెలంగాణకు వచ్చాయని వెల్లడించారు. తెలంగాణయే కేంద్రానికి డబ్బులిచ్చిందన్న కేటీఆర్.... అందుకు అమిత్ షా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. జలవిహార్‌లో 'గౌడ ఆత్మీయసభ'లో మంత్రి పాల్గొన్నారు.
అందుకే సోచో ఇండియా..
పర్యాటక స్థలాలకు వెళ్లినట్టు భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తున్నారని... హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు మాత్రం ఎవరూ రాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే... డబ్బులు వేస్తామన్నారు. కానీ ఇంతవరకు వేయలేదన్నారు. రూ.20లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతున్న మోదీ... బేచో ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని... అందుకే తెరాస సోచో ఇండియా అంటూ ప్రజలను కోరుతోందన్నారు.
ఆ ఘనత కేసీఆర్‌దే..
ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టాలని గౌడ సంఘాలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గౌడ వృత్తిదారుల ఆత్మ గౌరవాన్ని కాపాడే నీరా విధానం, బీసీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 57శాతం సీట్లిచ్చిన ఘనత కేసీఆర్‌దేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలో అభివృద్ధి కావాలనుకునే వాళ్లు తెరాసను గెలిపించాలని కోరారు. ఆరేళ్లుగా జీహెచ్ఎంసీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి: సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని అడిగారు: కేటీఆర్