దళితబంధును వెంటనే అమలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. దళితబంధుపై ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేయటం వల్లే అమలు ఆగిపోయందని మంత్రి స్పష్టం చేశారు. భాజపా చెబితేనో.. బండి సంజయ్ చెబితేనో.. మొదలు పెట్టిన పథకం.. దళిత బంధు కాదన్నారు. దళిత బంధుపై మాట్లాడటానికి బండి సంజయ్‌కు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు.
"బండి సంజయ్‌కు దమ్ముంటే భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితబంధు లాంటి పథకం పెట్టించాలి. కేంద్రం నుంచి దళితులకు ఏం తెస్తారో బండి సంజయ్ చెప్పాలి. హుజూరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా భాజపా ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ముందు ఆ మేనిఫెస్టోను అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాన్ని భాజపా ఎంపీ అరవింద్.. లొట్టపీసు చట్టం అంటూ హేళన చేశారు. దళిత జాతిని అవమాన పరిచిన ఎంపీని భాజపాలో ఉంచుకుని.. వారి సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరం. మా ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు. కాంగ్రెస్, భాజపాలు బాహాటంగా సహకరించుకోవడం వల్లే హుజూరాబాద్‌లో గెలిచారు. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకుని గెలిచిన రాజేందర్ విర్రవీగి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్ ఫలితం చిచ్చు రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఈటలతో కుమ్మక్కుకావడాన్ని కాంగ్రెస్ సీనియర్లే తప్పు పడుతున్నారు. కాంగ్రెస్, భాజపాల నీతి బాహ్యపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు." -కొప్పుల ఈశ్వర్, మంత్రి
ఇదీ చూడండి: