Jagadeesh Reddy Comments: విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలిపెట్టు అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్లో మార్పుల అంశంపై మంత్రి స్పందించారు. విద్యుత్ సంస్కరణలపై కేంద్రం తీరు మోసపూరితమేనని.. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించాకే లీకేజీలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్కరణలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. సాగుచట్టాలు మళ్లీ పెడతామని భాజపా నేతలు అంటున్నారని.. విద్యుత్ సంస్కరణల విషయంలోనూ కేంద్రం అదే వైఖరితో ఉందని జగదీశ్‌రెడ్డి అన్నారు. తాజాగా విద్యుత్ సంస్కరణల్లో మార్పుల అంశం తమ దృష్టికి రాలేదని చెప్పారు.
వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు సహా పలు విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీనికి సంబంధించి విద్యుత్ చట్టసవరణ బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఈ బిల్లు తొలి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశంపై కేంద్రం వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు.
ఇవీ చూడండి: