ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు కొవిడ్ టీకాల కోసం గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. టీకాల సేకరణ, ఆటో డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌పై సమీక్షించారు. జూన్ మూడో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు టీకాలు వేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, జిల్లా కేంద్రాల్లో రోజుకు పదివేల మందికి టీకాలు వేయనున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన వ్యాక్సిన్ల కోటాపైనా చర్చించారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ టీకా డోసులు వచ్చేలా ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరికరాలు సమకూర్చుకోవడం, ఆక్సిజన్ సరఫరా, స్టోరేజ్ యూనిట్లు తదితరాల గురించి ఆరా తీశారు. మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేలా తీసుకోవాల్సిన నియంత్రణా చర్యలపైనా సమావేశంలో చర్చించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య-ఆరోగ్య, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి