Harish Rao on BJP MLAs Suspension: భాజపా ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌పై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో సీఎం చెప్పారని గుర్తు చేశారు. వెల్‌లోకి వచ్చినందుకే భాజపా ఎమ్మెల్యేలు సస్పెండయ్యారని పేర్కొన్నారు. వెల్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాలేదని అందుకే వారిని సస్పెండ్ చేయలేదని వివరించారు. మీడియాతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు చిట్‌చాట్ చేశారు. తమ స్థానంలో నిలబడి అడిగితేనే రాజ్యసభలో 12 మందిపై చర్యలు తీసుకున్నారని హరీశ్ రావు తెలిపారు. దిల్లీకి ఒక న్యాయం.. రాష్ట్రానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు.
సస్పెండ్ అవ్వాలనే...
సస్పెండ్ అవ్వాలనే భాజపా నేతలు వెల్‌లోకి వెళ్లారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగం సమయాల్లో వెల్‌లోకి రాకూడదని చెప్పారు. ఈ ఆర్థిక ఏడాదిలో 40 వేల కుటుంబాలకు దళితబంధు సాయం అందిస్తామని వెల్లడించారు. 2022-23 పూర్తయ్యే నాటికి 2 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల కోసం నిధులను బడ్జెట్‌లో కేటాయించామని హరీశ్‌రావు వివరించారు.
అడ్డుతగులుతున్నారని...
శాసన సభలో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందర్రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆ ముగ్గురు నేతలు అసెంబ్లీ బయట ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి : శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్