వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్టు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖలో అద్భుత ప్రతిభ కనబరిచిన వైద్యులు, ఏఎన్ఎంలు, ఆషా వర్కర్లను మంత్రి హరీశ్ రావు సత్కరించారు. హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. కొవిడ్ సమయంలో విశేష సేవలు అందించిందుకు గానూ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, డా ప్రభాకర్ రెడ్డి సహా పలువురికి మంత్రి అవార్డులు అందించారు.
నూతనంగా ఏర్పాటు చేస్తున్న అన్ని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో బోధనా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. నిమ్స్‌లో అదనంగా 2000 పడకలు పెంచనున్నట్టు పేర్కొన్న మంత్రి... రాష్ట్రంలో సర్జరీ ద్వారా జరిగే ప్రసవాలను తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా వైద్యులు తప్పు చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో సిజేరియన్లు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి.. పరిస్థితి ఇలాగే కొనసాగితే అనవసరంగా ఆపరేషన్లు చేస్తోన్న వైద్యుల అనుమతులను మెడికల్ కౌన్సిల్ ద్వారా రద్దు చేస్తామని హెచ్చరించారు.
"మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎంతో మంచి నైపుణ్యమున్న వైద్యులున్నా.. వారు చేసే సేవలు వెలుగులోకి రావట్లేదు. అందుకే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం వల్ల అవార్డు గ్రహీతల్లో ప్రేరణ పొంపొందటమే కాకుండా.. మిగతావారికి కూడా స్ఫూర్తి లభిస్తుంది. " - హరీశ్‌రావు , మంత్రి
ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ గంగాధర్, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, టీవీవీపీ ఆస్పత్రుల డైరెక్టర్ అజయ్ కుమార్, టీఎస్ ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రమఖులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: