ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. ములుగు జిల్లాకు చెందిన షేక్ షబ్బీర్ తన ఇద్దరు పిల్లలు వైద్యులు కావాలని తపించారు. గతేడాది కరోనా కాటుకు షేక్ షబ్బీర్ మరణించాడు. తండ్రి చనిపోయి దిక్కులేనివారైన పిల్లలు షేక్ షోయబ్, సానియా దుఃఖాన్ని దిగమింగుకున్నారు. తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. సానియాకు వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలోను, షోయబ్‌కు రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. కానీ.. ఉన్న కష్టాలకోర్చి వాళ్లిద్దరినీ ఎంబీబీఎస్ చదివించేంత ఆర్థిక స్తోమత తల్లి దగ్గర లేదు.
ఇదే విషయాన్ని ఈ నెల 4న ఈనాడు, ఈటీవీ భారత్ ప్రధాన సంచికలో "ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. ఆర్థిక కష్టాలు కలిచి వేస్తున్నాయి" శీర్షికన కథనం ప్రచురితం కాగా పలువురు దాతలు ముందుకొచ్చారు. ఈ విషయం మంత్రి హరీశ్‌రావు దృష్టికి వెళ్లడంతో అన్నాచెల్లెళ్ల వైద్యవిద్య కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శనివారం(ఏప్రిల్ 16న) జహీరాబేగం, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాగా చదివి మంచి వైద్యులుగా పేదలకు సేవ చేయాలని వారిద్దరికీ మంత్రి సూచించారు. కరీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ జావెద్ హుస్సేన్ కూడా హనుమకొండలో విద్యార్థుల తల్లి జహీరాబేగానికి రూ.లక్ష అందించారు.
ఇదీ చూడండి: