ప్రపంచంలోనే చైతన్యానికి మారు పేరు తెలంగాణ సమాజమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన బీసీ టైమ్స్, మహాత్మ జ్యోతిబా ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనానికి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సమాజం ఎక్కువ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదని స్పష్టం చేశారు. చిన్న కులం వాళ్లమనే ఆత్మన్యూన్యతతో బతికే దౌర్భాగ్య పరిస్థితి అంతం కావాల్సిందేనన్నారు.
సమాజంలో బీసీలు కూడా గొప్పగా బతకాలని కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని చెప్పుకుంటున్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడా లేని.. మనిషిని మనిషి చిన్నచూపు చూసే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ఐక్యంగా ఉండి కులహంకార వ్యవస్థను అంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎంబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు: ఈటల