పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు బాధాకరమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అనుబంధంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇళ్ల పథకం ప్రారంభించినట్లు వివరించారు. కోర్టు తీర్పులకు ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టామని మంత్రి బొత్స వివరించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందని... ఇళ్ల పథకాన్ని అడ్డుకుంటే ప్రజలకు దిక్కెవరని ప్రశ్నించారు. సాంకేతిక తప్పిదాలు ఆసరాగా చేసుకుని తెదేపా నేతలు తమకున్న పలుకుబడితో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు తెదేపాకు తగిన బుద్ధి చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.
ఇదీ చూడండి: Maa elections: నేనేంటో చూపిస్తా.. ప్రకాశ్ రాజ్‌కు విష్ణు వార్నింగ్!