కరోనా ప్రభావం దినసరి కూలీలపై పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో కూలీల పరిస్థితి దీనంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో యజమానులు, గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు. చేసేదేమీ లేక సొంతూళ్లకు పయనమవుతున్నారు. పరిశ్రమలు, దుకాణాలు మూతపడటం, నిర్మాణాలు ఆగిపోయి ఉపాధి కరువైంది. తినడానికి తిండి దొరకడం కష్టంగా మారింది. పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో తెలియడం లేదు. రవాణా స్తంభించిపోవడం వల్ల పిల్లాపాపలను పట్టుకుని వందల కిలోమీటర్లు నడుస్తున్నారు.
కేపీహెచ్‌బీలోని ఓ ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసే 50 మంది కూలీలు వారి స్వస్థలాలకు బయల్దేరారు. నారాయణ్ ఖేడ్‌కు చెందిన వీళ్లంతా గత కొన్ని నెలలుగా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వారం రోజులుగా పనిలేక ఖాళీగా ఉంటున్నారు. యజమాని కూడా పట్టించుకోకపోవడం వల్ల చేసేది లేక ఊరికి వెళ్తున్నారు.
వలస కూలీల దీనస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. సుమారు 100మంది కూలీలు గాలి కూడా చొరబడని కంటైనర్‌లో సొంతూళ్లకు పయనమయ్యారు. పిల్లలను పట్టుకుని వందల కిలోమీటర్ల దూరంలోని స్వస్థలాలకు బయల్దేరారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ బైపాస్ వద్ద కంటైనర్‌ను పోలీసులు తనిఖీ చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు... కొన్నిరోజులుగా పని లేక సొంత రాష్ట్రం రాజస్థాన్‌కు వెళ్తున్నట్టు చెబుతున్నారు. నీరసించిపోయిన పలువురు కూలీలకు పోలీసులు అల్పాహారం అందించారు. హైదరాబాద్ సహా... చెన్నై, బెంగళూరు నుంచి కూలీలు సొంతూళ్లకు వెళ్తున్నారు. భోపాల్, ఆగ్రా, హర్యానా, రాజస్థాన్, బిహార్, గుజరాత్ కూడా కాలినడకన పయనమవుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో తొలి కరోనా మరణం... 67కు పెరిగిన బాధితులు