ఇక్కడ రోడ్డు పక్కన చిన్న పరదాలు వేసుకుని.. వాటి కింద ఇనుప చువ్వలను ఎర్రటి మంటలో కరగదీస్తున్న వీరంతా మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు. సుమారు 20 ఏళ్ల నుంచి నగరంలోని తిలక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. సుమారు పది కుటుంబాల వారు కమ్మరిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
పది రూపాయలు కూడా లేవు..
లాక్డౌన్ ఫలితంగా వీరికి పనిలేకుండా పోయింది. తిండి దొరకని పరిస్థితి నెలకొంది. వీరిలో ఒకరిద్దరికి రేషన్ కార్డులు ఉన్నాయి. మిగిలిన వారికి ఆధార్ కార్డులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం కొందరికి మాత్రమే అందాయి. తమకూ వస్తాయని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని.. కూరగాయలు, పప్పులు ఇతర వస్తువులు కొనుక్కోలేకపోతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఆకలి కేకలు..
హాయిగా ఆట పాటలతో గడపాల్సిన చిన్నారుల బాల్యం ఆకలి మంటలతో గడుస్తోంది. కొందరు బడికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేసేవారని.. పాఠశాలలు మూతపడిన తర్వాత తమతో పాటు పిల్లలు కూడా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తామంటే ఆకలికి ఓర్చుకుంటున్నామని.. తమ పిల్లలు ఆకలికి తట్టుకోలేక చెత్త కుండీల్లో ఉన్న ఆహార పదార్థాలను కూడా తెచ్చుకుని తింటున్నారని వాపోయారు.
కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో..
రెండు పూటలా భోజనం చేసి.. మూడు వారాలు గడిచిందంటూ కూలీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎక్కడ ఆహారం పంపిణీ చేసినా.. పరుగున వెళ్తామని.. ఆహారం దొరికితే ఆ పూటకు పండగేనని.. లేకుంటే పస్తుల కాలంలో మరో పూట చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమవైపు చూసిన దాఖలాలు లేవన్నారు. పిల్లలకు తిండిపెట్టలేని ఈ పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నామన్నారు.
ఇవీచూడండి: అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా..